ప్రతిదేశానికి తనదైన ఆధ్యాత్మిక విధానం ఉంటుంది.
ప్రతిదేశానికి తనదైన ఆధ్యాత్మిక విధానం ఉంటుంది.
ప్రతిదేశానికి తనదైన ఆధ్యాత్మిక విధానం ఉంటుంది నిజమే.కాని చాలా దేశాల ఆధ్యాత్మిక విధానాలు ఆ దేశాలలో పుట్టినవి కావు ఏదో ఇతరదేశం నుంచి ఐచ్ఛికంగా స్వీకరించినవో బలవంతంగా రుద్దబడినవో అయి ఉన్నాయి.నేటి ప్రపంచం లోని అనేక ఇస్లామిక్ దేశాల ఇస్లామిక్ విధానం అరేబియా నుంచి ఆ విధంగా వచ్చినది. నేటి క్రైస్తవదేశాలలోని క్రైస్తవ విధానం ఆ విధంగా ఒకనాడు రోమ్ నుంచి వచ్చినది.
భారతదేశం గురించి మనం స్వోత్కర్షతో చెప్పుకునేది కాదు. "మానవజాతికి మాతృభూమి ఇండియా. యూరప్ ఖండం లోని భాషలకు సంస్కృతం తల్లి. మన తత్వశాస్త్రాలకు గణితశాస్త్రానికి, ఆదర్శాలకు, ఆదర్శాలకు, ప్రజాస్వామ్యాలకు భారతదేశం తల్లి." అన్నాడు అమెరికన్ చరిత్రకారుడు విల్ డ్యురాంట్. భారతీయ ధర్మసంస్కృతులు దక్షిణ అమెరికా,మెక్సికో,గ్వాటెమాలా,జపాన్, చైనా, కొరియా వంటి సుదూరదేశాలకు వ్యాపించి విలసిల్లాయి.
భారతదేశం జపాన్ కు సాంస్కృతికంగా తల్లి అన్నాడు ప్రొ.నకామురా.
జపాన్ తత్వచింతన అధ్యయనం అంటే భారతదేశపు తత్వచింతన అధ్యయనమే అన్నాడు డా.డి.సుజుకి అనే జెన్ విద్వాంసుడు.
భారతదేశం ప్రపంచానికి ట్రిగొనామెట్రీ, బీజగణితం,వ్యాకరణం, ధ్వని శాస్త్రం, జానపద కథలు, చదరంగం, తత్వశాస్త్రం, మొదలైన వాటిలో గురువు. పత్తిపంట, చక్కెర తయారు చెయ్యడం భారతదేశం నుంచే ఇతరదేశాలకు వెళ్లాయి. ఖగోళశాస్త్రం, వైద్యశాస్త్రం, రసాయనశాస్త్రం, లోహ శాస్త్రం, మొదట భారతదేశం లోనే ఆవిర్భవించాయి. భారతదేశం మా చైనాను ఇరవై శతాబ్దాల పాటు సాంస్కృతికంగా జయించి ఆధిపత్యం వహించింది. మాపైకి ఒక్క సైనికుడిని పంపకుండాదీనిని సాధించింది " అన్నాడు ఒకప్పటి చైనా దౌత్యాధికారి హుషి. ఇవి స్వోత్కర్షతో మనం చెప్పుకున్న విషయాలు కావు కదా. భారతదేశం లోని నలందా,తక్షశిల, ఓదంతపురి, మొదలైన విశ్వవిద్యాలయాలకు అనేక విదేశాల నుంచి వేలాది విద్యార్థులు వచ్చి విద్యలు నేర్చుకుని వెళ్లేవారనేది చారిత్రకవాస్తవమే తప్ప స్వోత్కర్ష కాదు కదా.
ఇంక బౌద్ధ జైన ఆలయాలు వైదిక ఆలయాలుగా మారడం గురించి. బౌద్ధులు జైనులు అధికసంఖ్యలో వైదికమతంలో చేరిపోయి ఆ ఆలయాలలోకి వెళ్లేవాళ్లు ఇంచుమించు లేకుండా పోయినప్పుడు ఇలా జరిగింది తప్ప జీహాద్ వంటి వ్యవహారం ద్వారా కాదు.
శైవవైష్ణవ కలహాలు, వీరశైవుల అరాచకాలు పరిమాణంలో పోల్చితే ఇస్లాం క్రైస్తవ మతాల వ్యాప్తిలో జరిగిన హింసాకాండ రక్తపాతం కన్నా వేలరెట్లు తక్కువ. పైగా ఇవి మౌలికధర్మగ్రంథాల ప్రబోధాలతో జరిగినవి కావు.ఈ ధోరణులను కూడా మన సమాజం ఆమోదించలేదు. శైవసైన్యాలు, వైష్ణవ సైన్యాలు, బౌద్ధ జైన సైన్యాలు ఏర్పడి మతవ్యాప్తికై సామూహిక నరహత్యలు యుద్ధాలు చెయ్యలేదు. ఇస్లాం క్రైస్తవాల విషయంలో ఇలా జరిగింది.
రామాయణ భారతాలలో చార్వాకుడిని సంహరించడ మెక్కడ జరిగింది? సిధ్ధాంతపరంగా వ్యతిరేకించారు తప్ప చంపలేదు. పైగా చార్వాకదర్శనం అని దానికి ఒక గ్రంథస్థాయిని కూడా కల్పించారు కదా.
ఇక శంబుకవధ వృత్తాంతం ప్రక్షిప్తం కల్పితం. ఇది కల్పితం కాకపోతే శూద్రులు తపస్సు చెయ్యకూడదు అన్న నిషేధం మన శాస్త్రాలలో ఎక్కడైనా ఉండాలి .ఎక్కడా లేదు. శూద్రులకు నిర్ణయించబడిన పనులలో ఇది లేదు కదా అనవచ్చు. ఏ వర్ణానికి చెప్పబడిన పనులలోను లేదు. బ్రాహ్మణులకు చెప్పబడ్డవి -అధ్యయనం,అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం. ఇవే కదా, తపస్సు ఎక్కడుంది? ఆయా వర్ణాలకు చెప్పబడిన పనులు సామాజికజీవన సంబంధ మైనవే తప్ప తపస్సుకు దైవచింతనకు సంబంధించినవి కావు. తపస్సు విషయంలో ఎవరికి ఎప్పుడు ఏ నిషేధం లేదు. రామాయణం లోనే దశరథుడికి శాప మిచ్చిన ముని దంపతు లెవరో చూడండి. వాళ్లు తపస్సు చేసినందుకు ఏ శిక్ష పడిందో చెప్పండి.రాక్షసులే తపస్సులు చేసి వరాలు పొందారు కదా. శూద్రులకు అభ్యంతరమేమిటి?ఎప్పుడూ లేదు.
అదీకాక వర్ణాలకు చెప్ప బడ్డ పనులు నిర్బంధంగా విధించబడినవి కావు. నువ్వు ఫలానా వర్ణం కదా, ఆ వృత్తి ఎందుకు చేయటం లేదు అని కాని వేరే వృత్తి ఎందుకు చేస్తున్నావు అని కాని ఎవరూ ఎప్పుడు దండించబడ లేదు.
వర్ణాశ్రమధర్మరక్షణ అంటే వాటిని ఆచరించే వారికి సౌకర్యాలు రక్షణ కల్పించడమే తప్ప బలవంతంగా ఆ పని లోకి దింపడం కాదు. అలా ఎప్పుడూ జరగ లేదు. వానప్రస్థమో సన్యాసమో స్వీకరించమని ఎవరైనా నిర్బంధించ బడినట్లు విన్నామా?
Written by:
వి.వి.సుబ్రహ్మణ్యం.
9490104820.
Comments
1 comment
నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. చాలా చక్కటి విషయాలను ఉదాహరణకు చూపిస్తూ మీరు రాసిన వ్యాసం బాగుంది.కానీ ఇది కావాల్సిన వాళ్ళు వినరు ఇంత గొప్ప గొప్ప సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం మనకుందని గ్రహించరు.కారణం పాశ్చాత్య వ్యామోహం, మనలో లేని గొప్ప లక్షణం మనల్ని మనం తక్కువ చేయడమే. బయటి వాడెవడో రాసిన చరిత్ర వాస్తవం అని నమ్ముతారు. అనుభవం తో మనవారు రాసిన విషయాలు వీరి మస్తిష్కాన్ని చేరవు.కాలం చెల్లిన కథలు గా మిగిల్చారు.కారణం అవగాహన లేకపోవడం కూడా. రెండో ది అసలు చెప్పేది పట్టించుకోకుండా ఉండడం. అవతలి వాణ్ణి పొగడడానికి అలవాటు పడిపోయాం. ఇది సరైన సమయం.విశ్వం కన్ను తెరిపించి ప్రకటించవలసిన విషయాలు.తెలుసుకోవలసిన విషయాలు.🙏🙏🙏 ధన్యవాదాలు