విధి అంటే ఏమిటి?

విధికీ, మన జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవించే పరిస్థితులకు సంబంధం ఏమిటి ? 

విధి అంటే ఏమిటి? 

విధికీ, మన జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవించే పరిస్థితులకు సంబంధం ఏమిటి ? 

విధి అంటే లలాట లిఖితం అని మాత్రమే అర్తం కాదు. ‘విధి’ అంటే కర్తవ్యం అనికూడా అర్థం.  ‘విధి అనుల్లంఘనీయం’ అనునది శాస్త్రం. ‘శాసించేది’ శాస్త్రం. ఏది శాస్త్రం? వేదమే  శాస్త్రం. వేదం ..‘ఇలా చెయ్యి’ అని శాసిస్తుందే కానీ..చెప్పదు. వేదం ఏదైతే చెబుతుందో  అలా నడచుకునేవాడు సర్వసుఖాలు అనుభవిస్తాడు. అలా కాక. శాస్త్ర విషయములను అనుసరింపక..,తన ఇష్టము వచ్చినరీతిలో సంచరించు జీవుడు ఇహలోక సుఖాలు అనుభవించలేడు.., మరణించిన అనంతరం పరలోక సుఖాలు అనుభవించలేడు.’ అని గీతాచార్యుడు కురుక్షేత్ర రణభూమిలో ఉపదేశం చేసింది కేవలం అర్జునునకు మాత్రమే కాదు.., పరోక్షంగా మనకు కూడా. కనుక, వాద ప్రతివాదాలకు, తర్క వితర్కాలకు తావీయకుండా ‘శాస్త్రం’ చెప్పినది చేయడమే మన విధి. ‘శాస్త్రం’ ఇంత నిరంకుశమైనదా అని మీరు అడగవచ్చు. కచ్చితంగా నిరంకుశమైనదే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకో... ‘యోగి వేమన’ ఇలా చెప్తాడు. చాకలి వృత్తి చేసే వ్యక్తి, మాసిన దుస్తులను ఉడకబెట్టి, బండమీద బాది, వేడివేడి ఇస్త్రీపెట్టి క్రింద పెట్టి బాగా చలువచేసి చకుకగా మడతబెట్టి ఇచ్చినట్టు...మన మేలుకోరి బుద్ధి చెప్పేవాడు గ్రుద్దితే మాత్రం తప్పేమిటి?’ ‘శాస్త్రం’ కూడా ఇంత కర్కశంగానూ..నిష్కర్శగానూ చెబుతుంది. ‘శాస్త్రం’ చెప్పినట్టు నడచుకుంటే నిజంగా సుఖపడతామా అనే సందేహం మీకు కలగచ్చు. ‘సుఖపడతారు’ అని నిస్సందేహంగా చెప్పడానికి ఈ ప్రకృతే మనకు ప్రమాణం. ఎందుకంటే ‘ప్రకృతి ధర్మాలను’ ప్రవచించేదే ‘శాస్త్రం’. ప్రకృతికి విరుద్ధమైనది ఏదైనా..అది వికృతే,వినాశనమే. ప్రాణి ఉత్పత్తి, పెంపు, నశింపులకు ప్రకృతే కారణం. కనుక ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైనది ఏదైనా.. అది సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేది అయినా ఆచరణదాయకము శ్రేయోదాయకము ఎంత మాత్రమూ కాదు.

మీ జీవితంలో జరిగే సంఘటనలకు, మీరు అనుభవించే పరిస్థితులకు మూలం మీరే. ఇది నిజం! మనకు తెలియకుండా మనం సృష్టించుకున్న వాటన్నిటికీ మనం పెట్టుకున్న పేరు విధి. విధి మన మీద ఎక్కడి నుండో ఊడి పడటం లేదు, అది వేరెవరి చేతనో రాయబడలేదు. మీ గత చర్యలు, మీ మీద పడిన ముద్రలు - వీటన్నిటి ఫలితమే విధి! 

మీ మీద ఎన్నో ముద్రలు పడివుండవచ్చు. మీ పంచేంద్రియాల ద్వారా  మీరు స్వీకరించిన ఈ ముద్రల సంక్లిష్ట సమ్మేళనం కాలక్రమంలో ఒక వైఖరిగా మార్పు చెందుతుంది. ఈ వైఖరి మిమ్మల్ని ఒక నిర్దేశిత మార్గంలోకి నెడుతుంది. మార్గం మధ్యలో మీరు మరో మార్గంలో వెళ్ళాలనుకుంటే, అది మిమ్మల్ని వెళ్ళనివ్వదు, అది మిమ్మల్ని వేరే దారిలో తీసుకువెళ్తూనే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మీరు బస్సు ఎక్కిన తరువాత దారిలో మీకేదో ఆసక్తికరమైనది కనిపిస్తుంది. మీకు మీ మెడని బయటకి పెట్టి చూడాలనిపిస్తుంది. కానీ బస్సు వెళుతూనే ఉంటుంది. మీకు జరుగుతున్నది చూడాలని ఉంటుంది. కానీ మీరు అసహాయులు ఎందుకంటే బస్సు అక్కడి నుండి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళిపోతోంది. బస్సు ఎక్కింది మీరే అన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా, మీరు అరచి  పెడబొబ్బలు  పెడతారు.

ఏ శాస్త్రం చెప్పినా ఇంతే. దాని పరిధిలో మంచి చెడులను విశదీకరించి చెప్తుంది. అలాగే ప్రకృతి కూడా జీవి జీవన విధానాలను, ఆచరించవలసిన ధర్మాలను చెప్తుంది. ప్రకృతి ధర్మాలకు కట్టుబడి జీవించేవారిని ప్రకృతి కూడా జయించలేదు. దీనికీ నిదర్శనం ఉంది. ‘ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేతత్ పశుభి స్సమానాః’ ‘ఆకలి, నిద్ర, భయము, శృంగార జీవనము మనకు ఉన్నట్లే తక్కిన ప్రాణులన్నింటికీ ఉన్నాయి. కానీ..,ఈ ప్రకృతిలోని ప్రాణులన్నీ ప్రకృతి ధర్మానుసారం నడచుకుంటాయి, ఒక్క మానవుడు తప్ప. అందుకే ‘ఆర్య చాణక్యుడు’ ఇలా అంటాడు...

‘ఆకలి కాకున్నా.., ఆహారం తినే పశువు

దాహం కాకున్నా.., నీరు త్రాగే పశువు

నిద్ర రాకున్నా నిద్రకు ప్రయత్నించే పశువు

అకాలంలోను, అన్ని కాలాల్లోనూ రమించి,

క్రీడించే పశువు...., మానవుడు ఒక్కడే’

పాపం జంతువులకు ఈ బాధ లేదు. ఎన్నో కోళ్లు, మేకలు, చేపలు ప్రతినిత్యం బలైపోతున్నా.., మరెన్నో గ్రుడ్లు, ఆమ్లెట్లుగా మారిపోతున్నా.., ఆ ప్రాణులు అంతకు రెట్టింపు పుడుతూనేవున్నాయి. దీనికి కారణం అవి ప్రకృతితో మమేకం కావడమే.. మనం కాకపోవడమే. అంతకు మించి మరేదీ కాదు. ఇంతకన్న మరో నగ్నసత్యం చెప్పనా? మనిషికి తప్ప తక్కిన ప్రాణులకు మరణం లేదు. అవి చావవు.., చంపబడతాయి. వాటికి రోగాలు రావు. కనుకనే ‘జీవికి జీవినే ఆహారంగా చేసాడు ఆ దేవుడు.’ అందుకే వేద వాంఙ్మయం యఙ్ఞయాదుల్లో జంతుబలిని ఒక క్రమ పద్ధతిలో విధిగా నిర్ణయించింది. ఒక్క మనిషి మాత్రమే రోగాలతో, బాధలతో చస్తాడు.. లేదా ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ జంతువు ఆత్మహత్య చేసుకోదు. ఈ దౌర్భగ్యం ఒక్క మనిషికే. ఈ దౌర్భాగ్యస్థితి నుంచి మానవజాతి బయటపడాలంటే.. వాడు ప్రకృతిని ప్రేమించాలి., రక్షించాలి., దాని విధులకు లోబడి జీవించాలి. అంతకు మించి మరో మార్గం లేదు.

ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.

ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..!" మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది..!దానికి ఇంద్రుడు...

"దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను.నువ్వేం దిగులు పడకు..!" అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.

ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ..!

"నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు.

వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.

"నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే..! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం..! మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి..! " అన్నారు.

ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.

" ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు. ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. 

"అయ్యో..! అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..! " అని అన్నాడు .

యముడు , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!

"ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది..! " అని వ్రాసి ఉంది.

ఇదే విధి..! విధిని ఎవ్వరూ మార్చలేరు!!